వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖతో ఇరకాటంలో పడ్డ వైసీపీ.?

vijayamma-letter-a-big-jolt-for-ysrcp

vijayamma-letter-a-big-jolt-for-ysrcp

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి (విజయమ్మ) నిన్న విడుదల చేసిన బహిరంగ లేఖతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం వేడెక్కింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసు, షర్మిల పార్టీ వ్యవహారాలు.. ఇలా చాలా అంశాలపై మళ్ళీ చర్చ మొదలైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపైనా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సమయంలో విజయమ్మ స్పందించడం ఎంతవరకు కరెక్ట్.? అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. అత్యంత వ్యూహాత్మకంగా అధికార వైఎస్సార్సీపీ, తమ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ద్వారా బహిరంగ లేఖను విడుదల చేయించిందన్నది ఓపెన్ సీక్రెట్.

వైఎస్ వివేకా హత్య చుట్టూ రాజకీయ రచ్చ జరుగుతోంది గనుక, విజయమ్మ వివరణ ఇవ్వడం సబబే. కానీ, ఆ ఒక్క అంశమే కాదు, వైఎస్సార్ మరణం, కోడి కత్తి కేసు, షర్మిల పార్టీ అంశాలు కూడా బహిరంగ లేఖలో ప్రస్తావనకు రావడం వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారిందన్నది నిర్వివాదాంశం. కోడి కత్తి కేసు ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళినా, వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్ళినా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయా కేసుల విచారణలో ప్రత్యేక చొరవ చూపించి వుండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజమే. ఇక, విజయమ్మ లేఖపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నల్లో పెద్దగా అవాస్తవాలు ప్రజలకు కనిపించడంలేదన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున.. మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సింది పోయి, పరిస్థితిని మరింత సంక్లిష్టంగానూ, అనుమానాస్పదంగానూ మార్చేస్తున్నారనే విమర్శలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ విజయమ్మకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యతనివ్వలేదన్న ప్రశ్నకూ వైసీపీ నుంచి సరైన సమాధానం రాకపోవడం.. రాజకీయంగా ఆ పార్టీని ప్రజల్లో పలచన చేస్తోందేమో.!