ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ‘ఉప రాష్ట్రపతి పదవి దూరమవుతున్నాను.. రాజ్యసభకి దూరమవుతున్నాను. అంతే తప్ప, ప్రజలకు దూరం కావడంలేదు. రాజకీయాల్లో సన్నిహితులైనవారికీ దూరం కావడంలేదు..’ అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు రాజ్యసభలో. ఉప రాష్ట్రపతి అంటే రాజ్యసభ ఛైర్మన్ కూడా.
ఆ రాజ్యసభతో వెంకయ్యనాయుడికి విడదీయరాని బంధం వుంది. అదిప్పుడు తెగిపోయినట్టే. ఎందుకంటే, రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చేది లేదని ఆయన చెప్పేశారు మరి. ఇంకోసారి ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా వెంంకయ్య నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వలేదాయె.!
ఇక, రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. సభ సజావుగా జరిగి, చర్చ జరిగితేనే.. ప్రజలు హర్షిస్తారనీ సెలవిచ్చారు. వెంకయ్యనాయుడు చాలా చాలా ‘సుద్దులు’ చెప్పారు.
అయితే, రాజ్యసభలో వెంకయ్య నాయుడికి తీరని కోరిక మిగిలిపోయింది. ఎందుకంటే, ఆ ముఖ్యమైన విషయం వెంకయ్యనాయుడుతోనే మొదలై, ఆ వెంకయ్యనాయుడితోనే ముగిసిపోయిందిగానీ, ఆ విషయం.. కార్యరూపం దాల్చలేదు. అదే ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే క్రమంలో చట్ట సభల్లో బిల్లు పెట్టినప్పుడు వెంకయ్యనాయుడే నినదించారు.
బీజేపీలో అందర్నీ ఒప్పించి, కాంగ్రెస్ పార్టీని కూడా ప్రత్యేక హోదా విషయమై ఒప్పించిన నేర్పరితనం వెంకయ్యనాయుడు సొంతం. దురదృష్టమేంటంటే, వైరి పక్షం కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతృత్వంలో నడిచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్నీ ప్రత్యేక హోదాపై ఒప్పించగలిగిన వెంకయ్యనాయుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని (ఆ ప్రభుత్వంలో తాను భాగం అయి కూడా) ఒప్పించలేకపోయారు.
వెంకయ్యనాయుడి రాజకీయ జీవితంలో తీరని కోరిక అంటూ ఏదైనా వుందంటే, అది ప్రత్యేక హోదా మాత్రమేనేమో.!