ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ్రైవ్ దేనికోసమో తెలుసా.? కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం. ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, బస్ డ్రైవర్లు, మద్యం దుకాణాల సిబ్బంది.. ఇలా కరోనా వ్యాప్తికి కారకులవుతారనే అనుమానం వున్న వారికి ముందుగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తారు. అదే సమయంలో, 18 నుంచి 45 ఏళ్ళ వయసు మధ్యవారికి కూడా వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు, తమ సంస్థల సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ నెల 28వ తేదీ నుంచి 18 ఏళ్ళ పైబడిన వయసు వారందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. నిజానికి, 18 ఏళ్ళ పైబడినవారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా పలు రాష్ట్రాలు 45 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే.. అది కూడా రెండో డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే చేస్తూ వచ్చాయి ఇప్పటిదాకా. ఇదిలా వుంటే, దేశంలో వ్యాక్సిన్ లభ్యత క్రమంగా పెరుగుతుండడం, అదే సమయంలో రాష్ట్రాలు గ్లోబల్ టెండర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో.. 18 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారందరికీ వ్యాక్సినేషన్ కోసం మార్గం సుగమం అవుతోంది. కాగా, ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లు ఉచితం కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక ధరలకు వ్యాక్సిన్ లభించనున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నా వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఆ ధరల్ని తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.