వామ్మో.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఇంత జోరుగా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలే ఈ రేంజ్ లో జరుగుతాయని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. వాళ్లు కాదు వీళ్లు కాదు.. ఏకంగా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రులు దిగొచ్చారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు దిగుతున్నారు. ఏంటో.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా.. ఎన్నికల ప్రచారం హడావుడే.
బీజేపీ అయితే కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. యూపీ సీఎం యోగిని డైరెక్ట్ గా పాతబస్తీలోనే దించింది. ఓవైపు బండి సంజయ్.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ అంటారు.. మరోవైపు యూపీ సీఎం డైరెక్ట్ గా ఓల్డ్ సిటీలోనే ప్రచారం చేశారు.
కేవలం పాతబస్తీలో ప్రచారం చేయడం కోసమే యూపీ సీఎంను బీజేపీ హైదరాబాద్ కు రప్పించిందట. పాతబస్తిలోనే దాదాపు 50 దాకా డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న డివిజన్లన్నీ ఎంఐఎం కంచుకోటలు. పోయినసారి ఎన్నికల్లో ఎంఐఎంకు 44 సీట్లు వచ్చాయి.
మేయర్ పీఠానికి పోటీ పడాలంటే ఇక్కడ వచ్చే సీట్ల మీదనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే.. బీజేపీ ప్లాన్ మార్చి.. కేవలం పాతబస్తీలో ప్రచారానికి ఏకంగా యోగిని తీసుకొచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు పాతబస్తీలో చెక్ పెట్టి మరీ.. అక్కడి స్థానాలను గెలుపొందాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ జోరు చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేసి మరీ గ్రేటర్ లో పాగా వేయాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే.. కేంద్ర మంత్రులు కూడా ఒక్కొక్కరు హైదరాబాద్ లో దిగుతున్నారు. చూద్దాం.. మరి గ్రేటర్ లో బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదో?