కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి భార్య విజయ నాయక్‌తో పాటు ఆయన పీఎ మరణించారు. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుకా హోసకంబి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ కారు కర్నాటకలోని యల్లాపుర నుంచి గోవాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీపాదయ నాయక్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను హుటాహుటిన గోవాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెళ్లారు. శ్రీపాద నాయక్ పరిస్థితితో పాటు ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదం ధాటికి మంత్రి ప్రయాణిస్తున్న టొయోటా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో మాట్లాడి నాయక్ అత్యవసర చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 68 ఏళ్ల నాయక్ ఉత్తర గోవా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా, మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.