కరోనాకు చిన్నాపెద్దా, పేదాధనిక, సామాన్యసెలబ్రిటీ.. అనే తేడాలు అస్సలు ఉండవు. కరోనా కులాన్ని చూసి.. ఆస్తిని చూసి.. అంతస్తును చూసి రాదు. ఈ ప్రపంచంలో అందరూ సమానమే. ఎవ్వరూ ఎక్కువ కాదు.. ఎవ్వరూ తక్కువ కాదు అని నిరూపించింది కరోనా . అందుకే ప్రతి ఒక్కరు కరోనా అంటేనే బయపడుతున్నారు.
సాధారణ ప్రజలకే కాదు.. సినిమా సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కరోనా సోకుతోంది. వాళ్ల తాట తీస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు వరుస పెట్టి వచ్చింది కరోనా. తాజాగా మరో మంత్రి కూడా కరోనా బారిన పడ్డారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన వయసు 63 ఏళ్లు.
తనకు కరోనా సోకినట్టుగా క్రిషన్ పాల్ ట్వీట్ ద్వారా దేశ ప్రజలకు వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నా. కొన్ని రోజుల క్రితం నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి హోం క్వారంటైన్ లో ఉండండి. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి.. అంటూ కేంద్ర మంత్రి సూచించారు.
మరోవైపు ఈ కరోనా మహమ్మారి కేంద్ర మంత్రులను వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పడ్డారు. ఆయన కూడా కరోనా ట్రీట్ మెంట్ తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్రసింగ్ షెకావత్, శ్రీపాద నాయక్ కు కూడా కరోనా సోకింది. వీళ్లంతా కరోనా చికిత్స చేయించుకొని ప్రస్తుతం సేఫ్ జోన్ లోనే ఉన్నారు.
ఇక.. కరోనా లెక్కల విషయానికి వస్తే… భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు 33 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కరోనాను జయించిన వాళ్లు 25 లక్షల మంది. అయితే కరోనాతో మరణించిన వాళ్ల సంఖ్య సుమారు 60 వేలు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా యాక్టివ్ కేసులు సుమారు 7 లక్షలు.
ఇక.. దేశంలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, యూపీ, తెలంగాణ టాప్ లో ఉన్నాయి.
దేశం మొత్తం మీద ఇప్పటి వరకు సుమారుగా 3 కోట్లా 85 లక్షల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు. గత 24 గంటల్లో సుమారుగా 9 లక్షల శాంపిల్స్ ను పరీక్షించారు.
మరోవైపు ఈనెల 31తో అన్ లాక్ 3 ముగియనుండగా.. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4ను ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే అన్ లాక్ 4 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.