టీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం…తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి

ఈ ఏడాది టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ ఇప్పటికే పలువురు కీలక నేతలని కోల్పోయింది.

తాజాగా మరో సీనియర్ నేత మృతి తో టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత విషాదం నెలకొంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్ను మూశారు. ఆయన వయసు 83 ఏళ్లు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పలు కీలక పదవులు నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి మంత్రివర్గంలో రాంరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జలగం వెంకట్రావు, ఎన్‌ జనార్దన్ ‌రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగిన ఆయనకు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున పరిగి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయినా అప్పుడు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రామిరెడ్డికి కేవలం 13 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2018 ఎన్నికల సమయానికి బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక టీఆర్ఎస్‌లో చేరారు. కానీ, వయసు పైబడడం వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.రాంరెడ్డి మ‌ృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.