ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం కోసం సమాయత్తం అవుతున్నాయి.
అయితే.. వేరే ఎన్నికల సంగతి ఎలా ఉన్నా… దుబ్బాక ఉప ఎన్నికను మాత్రం అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ అయితే దుబ్బాకలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి 62500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఆయన మరణంతో దుబ్బాకలో ఉపఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన భార్యనే బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి గెలుపు కోసం మంత్రి హరీశ్ రావుకు సీఎ కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి.. దుబ్బాక గెలుపునకు సంబంధించి వ్యూహాలు పన్నుతున్నారు.
ఈసారి ఎలాగైనా లక్ష ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచేలా కృషి చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారట. దీంతో వెంటనే నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు.
టీఆర్ఎస్ పార్టీ దూకుడుతనంతో ముందుకెళ్తుండటంతో.. కనీసం ఈ ఉపఎన్నికలో అయినా గెలిచి తమ సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉబలాటపడుతున్నాయి.
బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలోకి దిగుతారని వార్తలు వస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఇంకా టికెట్ ఎవరికి ఇచ్చారో తెలియడం లేదు. ఏది ఏమైనా.. అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.