తెలంగాణ :ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కండువాను ఏకంగా గణనాధుడి మెడలో వేశారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పలు చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రావినూతల శశిధర్ అనే ఫేస్ బుక్ యూజర్ తన అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 2.46 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కవితతో పాటు కొందరు టీఆర్ఎస్ నాయకులు గుడిలో పూజలు చేశారు. ఆ సమయంలో ఓ టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ కండువాను పూజారికి ఇచ్చారు. అక్కడున్న ఇద్దరు పూజారుల్లో ఒకరు ఆ కండువాను వినాయకుడి మెడలో వేశారు. దీనిపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుననారు. అలాగే, ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. కవితను MLC పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు టీఆర్ఎస్ పార్టీ మీద, కవిత మీద మంపడితున్నారు. దేవుడి గుడిలో కూడా రాజకీయాలు చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం పూజారి తీరును తప్పుపడుతున్నారు. ఒకవేళ దేవుడి మీద భక్తితో ఎవరైనా ఓ వస్త్రం ఇస్తే దాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి తిరిగి ఇచ్చేయాలి కానీ, ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దేవుడి విగ్రహం మెడలో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల విషయాలలోకి వెళ్తే… డిసెంబర్ 1న జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 125 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 105, రెండో జాబితాలో మరో 20 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు షాక్ ఇచ్చింది. కొన్ని కీలక ప్రాంతాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.