ఏడేళ్ళలో కనిపించని జోష్, విపక్షాల్లో ఇప్పుడిప్పుడే కనిపిస్తుండడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటినా, దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన బొటాబొటి గెలుపు.. ఇవన్నీ కేసీయార్‌ని భయపెడుతూనే వున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడ గనుక, కాంగ్రెస్ లేదా బీజేపీ సత్తా చాటితే.. తెలంగాణ రాష్ట్ర సమితికి చావు దెబ్బ తగిలినట్లే. ఈ నేపథ్యంలోనే అత్యంత వ్యూహాత్మకంగా కేసీయార్ అడుగులేస్తున్నారు.
హుజూరాబాద్ సీటుని ఎలాగైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మొత్తంగా అధికారాన్నంతా అక్కడే కేంద్రీకరిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. అయినాగానీ, పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడంలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి కొందరు ముఖ్య నేతలు వలస వస్తున్నారు. గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. బీజేపీ సంగతి సరే సరి. కేంద్రంలో తమకు అధికారం వుండడంతో ఆ బలాన్నంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ప్రయోగించాలనుకుంటోంది బీజేపీ.. ప్రయోగిస్తుంది కూడా. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విపక్షాలు విడివిడిగా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూనే వున్నాయి. సందట్లో సడేమియా.. అన్నట్టు కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంటోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారు. పెద్దయెత్తున జనాన్ని సమీకరిస్తున్నారు తాను చేపడుతున్న నిరసన కార్యక్రమాల కోసం షర్మిల. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ముందు ముందు తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయని అనిపించడం సహజమే. మరి, ముప్పేట ఎదురవుతోన్న దాడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీయార్ ఎలా కాపాడతారన్నది వేచి చూడాల్సిందే.