Tollywood: మాములుగా ఇది వరకటి ఆ హీరోలు ఎంత కష్టమైనా సరే సన్నివేశాలలో నటించేవారు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలేవి. కానీ రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని సన్నివేశాలలో హీరోలకు బదులుగా ఎక్కువగా డూపులు నటిస్తున్నారు. రిస్కీ స్టంట్ లు, ఫైట్స్ సన్నివేశాలు వంటి వాటిలో హీరోల డూప్లే ఎక్కువగా నటిస్తున్నారు. అప్పుడప్పుడు రియల్ హీరోల్లాగా టీవీ షోల్లో హల్‌చల్ చేస్తుంటారు.
అయితే ఈ మధ్య హీరోల సినిమాల కంటే వారి డూప్ ల గురించే టాలీవుడ్ లో ఎక్కువగా చర్చ నడుస్తోంది. మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు తమ సినిమాల్లో బాడీ డబుల్స్ ను ఎక్కువగా వాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు స్టార్ హీరోలు కేవలం క్లోజ్ అప్ షాట్ల కోసం మాత్రమే కెమెరా ముందుకు వస్తున్నారట. యాక్షన్ సీన్స్, వైడ్ షాట్లు, రిస్క్ తో కూడిన స్టంట్స్ లో మాత్రం వారి బాడీ డబుల్స్ తో అంటే డూప్స్ తో చేయిస్తున్నారని టాక్.
అయితే ఒకప్పుడు హీరోలు స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు, పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో, భారీ బడ్జెట్ చిత్రాల్లో రిస్క్ తీసుకోవడానికి హీరోలు ముందుకు రావడం లేదట. ఒక మీడియం రేంజ్ హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్ ను బాడీ డబుల్స్ కు ఇస్తున్నారని, వారిని బాగా చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కాగా హీరోల డూప్స్ కి ఏకంగా కోట్లలో డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ మధ్యకాలంలో డూప్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది.