ఇంతకు ముందులా హీరోలకు కోట్లకు కోట్లు రాలవు

Tollywood Producers request to heroes

Tollywood Producers request to heroes

ఎన్నో ఏళ్ల నుండి తెలుగు ఇండస్ట్రీలో నడుస్తున్న పెద్ద చర్చ హీరోల పారితోషకం. సినిమా నిర్మాణంలో 40 నుండి 50 శాతం హీరో పారితోషకానికే పోతోందని, అందుకే నిర్మాతలు మీద భారం పడుతోందని, దాన్ని తప్పించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ల మీద భారం వేస్తున్నారని అంటున్నారు. కాబట్టే సినిమా మంచి వసూళ్లు సాధించినా చివరకు డిస్ట్య్రిబ్యూటర్లకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ లెక్కల్లో నిజం ఉంది. హీరోల పారితోషకం ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. హీరోల డేట్స్ పట్టుకోవడం కోసం అయిష్టంగానే వడ్డీలకు తెచ్చి పెద్ద హీరోలకు అడ్వాన్సులు ఇస్తుంటారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కొందరు రేమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు తలనొప్పిగా మారారు. స్టార్ హీరోలు అంటే వాళ్ళకు మార్కెట్ ఉంది కాబట్టి డిమాండ్ చేసినా అర్థం పర్థం. కానీ స్థిరమైన మార్కెట్ లేని హీరోలు సైతం భారీగా ఇవ్వమంటున్నారు. అంత పెద్ద మొత్తం ఇచ్చి సినిమాలు చేసి అవి వెనక్కు రాక నష్టపోయిన నిర్మాతలు చాలామందే ఉన్నారు. వీరికే ఇకపై చెక్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇప్పటికే టికెట్ రేట్లు భారీగా తగ్గాయి. అవి ఎప్పుడు మారుతాయో ఎవ్వరికీ తెలీదు. అసలు మారుతాయనే నమ్మకం లేదు.

ఈ సమస్యకు ఏకైక పరిష్కారం హీరోల చేతుల్లోనే ఉంది. హీరోలు పారితోషకం తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ చాలావరకు కంట్రోల్ అవుతుంది. అందుకే హీరోలకు రెమ్యునరేషన్ తగ్గించుకోమని సంకేతాలు ఇస్తున్నారట నిర్మాతలు. మరి హీరోలు వారి క్షేమం కోరి రేట్లు తగ్గిస్తారో లేకపోతే అలానే గాల్లో ఉంటారో చూడాలి.