Tollywood: సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. ఆఖరి నిమిషంలో క్యాన్సిల్.. కారణం అదే!

Tollywood: ఇటీవల థియేటర్స్ వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ థియేటర్స్ పై టాలీవుడ్ పై సీరియస్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిసారా అని ప్రశ్నించడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రముఖులు సీఎం చంద్రబాబు ని కలవడానికి సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్ లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్ కి ఆహ్వానించారు.

అయితే నేడు టాలీవుడ్ ప్రముఖులు మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరికి టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళాల్సి ఉంది. సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే లిస్ట్ లో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు అలాగే హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారు. నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.

అయితే ఈరోజు కలవాల్సి ఉన్నా కానీ ఈ మీటింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ మీటింగ్ కి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ సమావేశం వాయిదా వేసినట్టు సమాచారం. అలాగే ఈ మీటింగ్ కి రావాల్సిన సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున పిలిచినా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో మరింత చర్చగా మారింది. మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి మరి.