Tollywood Lands In AP : తెలుగు సినీ పరిశ్రమ మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళిందనడం అతిశయోక్తి కాదేమో.! మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
గత కొంతకాలంగా సినీ పరిశ్రమకీ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకీ మధ్య ‘మాటల యుద్ధం’ జరుగుతోందన్నది ఓపెన్ సీక్రెట్. ‘సినీ జనాలు బలిసి కొట్టుకుంటున్నారు..’ అంటూ ఓ వైసీపీ ప్రజా ప్రతినిథి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొన్నాళ్ళ క్రితం. మరోపక్క, సినీ పరిశ్రమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్తించడంలేదంటూ ఇంకొందరు వైసీపీ నేతలు వాపోయారు.
సరే, పరిశ్రమ నుంచి వ్యక్తిగతంగా పలువురు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, అధికార వైసీపీ నేతల మీదా చేస్తున్న వ్యాఖ్యలు తక్కువేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి. అసలు సమస్య వేరు, జరుగుతున్న రచ్చ వేరు. కోవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. థియేటర్ల సమస్యలు, టిక్కెట్ల వ్యవహారాలు.. ఇలా చాలానే వున్నాయి.
వీటన్నిటిపైనా ముఖ్యమంత్రితో చర్చించి, పరిష్కారం కోసం ప్రయత్నించాలనే పరిశ్రమ పెద్దల ప్రయత్నాలు సఫలమవడంలేదు. ఈ నేపథ్యంలో, ఇంకాస్త గట్టిగా పరిశ్రమ నుంచి ప్రయత్నమైతే షురూ అయ్యింది. ఏపీలో ఫిలిం సిటీ నిర్మాణం, ఏపీలో సినిమా షూటింగులు.. ఇలా పలు అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం వుంది.
‘కమ్యూనికేషన్ గ్యాప్’ తగ్గి, పరిశ్రమ – ప్రభుత్వం కలిసి ఓ అవగాహనకు వస్తే.. ఇరు పక్షాలకూ మేలు జరుగుతుందన్నది నిర్వివాదాంశం.