ఓ దర్శకుడు మాత్రమే ఇప్పటిదాకా ఏపీలో సినిమా టిక్కెట్లకు సంబంధించి ప్రభుత్వ వెబ్‌సైట్ అంశంపై స్పందించాడు. ప్రభుత్వం, వెబ్‌సైట్ ఏర్పాటు చేసి, దాని ద్వారానే టిక్కెట్లు అమ్మాలనే నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు, రాష్ట్రంలో థియేటర్లలో టిక్కెట్ ధరలపైనా ఓ కీలక నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఏపీ సర్కారు నిర్ణయంతో సినీ పరిశ్రమ ఖంగు తిన్నమాట వాస్తవం. కానీ, పైకి ఎవరూ గట్టిగా ఈ విషయమై స్పందించలేకపోతున్నారు. ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలవడానికి కారణం, ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించిన గందరగోళమే. అయినాగానీ, సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులు ఈ అంశాలపై స్పందించడంలేదు. నిజానికి, సినిమా టిక్కట్ల ధరలు సామాన్యులకు గుదిబండలుగా మారుతున్నాయనే ఆవేదన చాలామందిలో వుంది. అది నిజం కూడా. ఎవరు లాభపడుతున్నారు.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.
బ్లాక్ టిక్కెట్ల కారణంగా నిర్మాతలకు లాభం లేదా.? అంటే, కొందరు తెలివైన నిర్మాతలు.. అలా లాభపడిన సందర్భాలున్నాయంటారు సినీ పరిశ్రమలో కొందరు. ఇదిలా వుంటే, టిక్కెట్ల ధరల్ని రెగ్యులేట్ చేయడం ద్వారా పెద్ద సినిమాలు రూపొందడం కష్టతరమవుతుంది. పాన్ ఇండియా సినిమా అనే ఆలోచనల్ని ఏపీ మార్కెట్‌ని మినహాయించి చేసుకోవాల్సి వుంటుంది దర్శక నిర్మాతలకి. ఏపీ నుంచి వచ్చే వసూళ్ళను పరిగణనలోకి తీసుకోకుండా సినిమాలు తీస్తేనే నిర్మాతలకు శ్రేయస్కరం. ఇక, ప్రేక్షకులంటారా.? తక్కువ ధరలో సినిమా అందుబాటులోకి వస్తే, వాళ్ళెందుకు కాదంటారు.? ప్రేక్షకుల కోణంలో ప్రభుత్వ చర్యలు సమర్థనీయమే. దేశవ్యాప్తంగా సినిమా ఎటూ రిలీజ్ చేయాలని పాన్ ఇండియా సినిమా నిర్మాతలు అనుకుంటారు గనుక, నష్టమైనా తప్పదు.. ఏపీలో విడుదల చేయాల్సిందే. అదే పద్ధతి ఇతర రాష్ట్రాల్లోనూ అమలయితే మాత్రం.. సినిమాలు మానేసుకోవడం తప్ప నిర్మాతలకు మరో మార్గమే లేదు.