వైసీపీ నేత అంబటి రాంబాబుగారు సోషల్ మీడియాలో మాములు హడావుడి చేయట్లేదు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మీద విమర్శలు చేయాలనుకున్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రంలోనే జెండా ఎగురవేయాలి, స్వాతంత్య్ర దినోత్సవం సొంత రాష్ట్రాల్లోనే జరుపుకోవాలి అని అర్థం వచ్చేలా అంబటి రాంబాబుగారు వేసిన ట్వీట్ మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. కేవలం జనసైనికులు, టీడీపీ అభిమానులే కాదు ఇతర నెటిజన్లు సైతం అంబటిగారి వితండపు వాదన చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇదేం తరహా అభిప్రాయం, ఇదేమన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవమా రాష్ట్రాల్లోనే జరుపుకోవడానికి అంటూ నవ్వుకోగా జనసేన కార్యకర్తలు ఘాటుగానే స్పందించారు.
వైఎస్ జగన్ ఎప్పుడూ హైదరాబాద్లో జెండా ఎగురవేయలేదా, అయినా హైద్రాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగానే ఉంది. జాతీయ జెండా అంటే మీ పార్టీ జెండా అనుకుంటున్నారా, ఈ అర్థం పర్థం లేని ట్వీట్లు ఆపండి అంటూ విమర్శించారు. విమర్శలు గట్టిగా తగిలాయేమో కానీ నిన్న మరొక ట్వీట్ వేసి ఆశ్చర్యపరిచారు. పాత ట్వీట్ అంటే ఏదో పొరపాటున వేశారు అనుకుంటే దానికి కొనసాగింపుగా వేసిన కొత్త ట్వీట్ ఇంకా చిత్రంగా ఉంది. అందులో ‘నా ట్వీట్ కి జనసైనికులు భారిగా స్పందించారు. గౌరవంగా, లాజిక్ తో కూడిన స్పందన చాలా తక్కువ మందిలో చూసాను.
అసహనం, అసభ్య పదజాలంతో స్పందించిన వారి సంఖ్యే చాలా ఎక్కువ ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంతకాలం,”జనసేనను” భగవంతుడే కాపాడలి’ అన్నారు. ఈ ట్వీట్లో ఒకటి కాదు అనేక అర్థాలు వినిపించాయి. ఏదో జనసైనికుల క్రమశిక్షణ ఎలాంటిదో పరీక్షించడానికి ట్వీట్ వేశాను. ఈ పరీక్షలో మీరు ఫెయిల్ అయ్యారు అనేలా ఒక అర్థం. గౌరవంగా, లాజిక్ తో స్పందించారు అనడాన్ని బట్టి తాను వేసిన ట్వీట్ పొరపాటుగా ఉందని అంబటి ఒప్పుకున్నట్టే అన్నట్టు ఉంది. మొత్తం మీద రెండో ట్వీట్ మొదటి ట్వీట్ యొక్క తప్పిదాన్ని కవర్ చేయకపోగా కొత్త తప్పును బయటపెట్టి మరోసారి సార్.. మీ ఒక్కో ట్వీట్ ఒక్కో ఆణిముత్యం అనే జనసేన కార్యకర్తల కౌంటర్లకు గురయ్యారు.