ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేంద్రం అడుగు పెడుతుందా – పెడితే ఆరెస్టులు ఉంటాయా ?

ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ మొదలైన కొత్త వివాదం ఫోన్ ట్యాపింగ్ అంశం.  ప్రభుత్వం న్యాయవాదులు, జడ్జిలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  ఈ విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.  ఈ లేఖ సారాంశం ఏమిటంటే జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కనుక ప్రధాని జోక్యం చేసుకోవాలనేది బాబుగారి వాదన.  మరి ఆయన వాదన మేరకు కేంద్రం విషయంలో కలుగజేసుకుంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.  ఎందుకంటే ప్రభుత్వానికి కేంద్రానికి మధ్యన సంబంధాలు అలా ఉన్నాయి. 
 
 
ఎంతో ముఖ్యమైన ఏపీ రాజధాని విషయంలోనే తాము వేలు పెట్టలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.  అది రాష్ట్రం పరిధిలోని విషయమని, నిర్ణయం వారిదేనని చేతులు దులిపేసుకుంది.  కేంద్రం వాదన కరెక్ట్ అని కొందరు అంటే కేంద్రం కావాలనే జోక్యం చేసుకోవడంలేదని, రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం మేరకే కేంద్రం మౌనంగా ఉందని వాదిస్తున్నారు.  వాటిలో నిజానిజాలు ఎలా ఉన్నా అంత పెద్ద వివాదంలోనే కలుగజేసుకోని కేంద్రం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కలుగజేసుకుంటుందా అనేదే అనుమానంగా మారింది.  రాష్ట్రాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కేంద్రం కలుగజేసుకోదు కానీ కొన్ని విషయాల్లో అంటే భద్రతాపరమైన విషయాల్లో అనుకుంటే జోక్యం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. 
 
అదే నిజమైతే ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మోదీ స్పందించవచ్చు.  కానీ తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ చంద్రబాబు రాసిన లేఖలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయో చెప్పలేదు.  అయినా ఇది రాష్ట్రం పరిధిలోని అంశం.  కేంద్రం పట్టించుకోదు అనేశారు.  కానీ ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడి మేరకు కేంద్రం పట్టించుకుని విచారణకు ఆదేశించినా అది నామమాత్రపు విచారణే అవుతుంది తప్ప బలంగా ఉండటం, అరెస్టులు జరగడం లాంటి పరిణామాలు ఉండకపోవచ్చు.