ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అడుగడుగునా అద్దంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ భూ పంపిణీ మీద కేసులు నడుస్తున్నాయి. పేదల ఇళ్లకు కన్వేయన్సు డీడ్లు ఇవ్వకూడదనేది నియమం. కేవలం డీకేటీ, బీఫాం రూపంలోనే పట్టాలు ఇవ్వాలి. కానీ నియమాన్ని కాదని ఏపీ సర్కార్ విక్రయించుకునే హక్కును కూడా కల్పించాలని అనుకుంది. దీని మీదే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఉచిత పట్టాలకు కన్వేయన్సు డీడ్లు ఎలా ఇస్తారని, అది రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇంకా అక్కడ కేసు తేలలేదు. ప్రకాశం జిల్లా సర్వేరెడ్డిపాలెం, యర్రజెర్ల, కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల పరిధిలోని ఖనిజ, పశువుల మేతకు కేటాయించిన భూముల్లో 1307 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చింది.
మైనింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని అంటూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవి చాలవన్నట్టు పంపిణీ కోసం రాజమహేంద్రవరం సమీపంలో సేకరించిన 600 ఎకరాల ఆవ భూములు కొద్దిపాటి వర్షానికే నీట మునిగాయి. భూముల మద్యలో సుమారు 10 అడుగుల వరకు వరద నీరు చేరుకుంది. దీంతో ఆవ భూములు నివాసయోగ్యం కాదనే ప్రతిపక్షాల ఆరోపణలే నిజమయ్యాయి. ఆవ భూములను కొనుగోలు చేసినప్పుడే వాటికి వరద ముప్పు ఉందని, అలాంటి ప్రదేశంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగగా అవి ఆవ భూములు కాదని, అవసరం అయితే మట్టి వేసి పైకి లేపుతామంటూ ప్రభుత్వం పంపిణీకి ఏర్పాట్లు చేసింది.
కానీ గోదావరి వరదతో ఆ భూములు నీట మునగడంతో అవి ఆవ భూములేనని రూఢీ అయింది. ఈ పరిణామంతో ప్రతిపక్షాలు మరింత దూకుడు పెంచాయి. ఆవ భూములు కాదని వాదిస్తూ పంపిణీకి సిద్దమయ్యారు. ఒకవేళ వర్షాలు పడకుండా ఉంటే పేదలకు ఆ భూములను పంచేసేవారు. మీ మాటకు నమ్మి లబ్దిదారులు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ల బ్రతుకులు నీళ్ల పాలయ్యేవి కదా, పేదల ప్రాణాలంటే అంత చులకనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఎకరం10 లక్షలు విలువ చేసే ఆవ భూమిని ఎకరానికి 40 లక్షలు చెల్లించి సుమారు 600 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడేమో ఆ భూములు నివాసయోగ్యం కాదని తేలింది. ఇప్పుడేం చేస్తారు. వందల కోట్ల ప్రజాధనం వృధా అయినట్టే కదా. ముందు నుండి మేము ఆరోపిస్తున్నట్టు ఆ భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.