ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వార్ మాత్రం కొనసాగుతోంది. మరో 10రోజుల్లో రిటైర్ కానున్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో తాను జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ అడం, తన సెలవులకు సంబంధించిన లేఖలు బయటకు రావడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రతివాదులుగా గవర్నర్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణను చేర్చారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం శనివారం విచారించే అవకాశముంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ తో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎస్ఈసీకి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. గవర్నర్ తో చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉండాల్సింది పోయి ఇలా బహిరంగం కావడంపై దర్యాప్తు చేయాలని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల సమయంలో మొదలైన వైరం మధ్యలో కాస్త శాంతించినా.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ మొదలైంది. తమను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై బుధవారం చర్చించిన కమిటీ.. గురువారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. ఐతే ఈ నోటీసులు తనకు వర్తించవని నిమ్మగడ్డ భావిస్త్తున్నట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై గత నెలలో సమావేశమైన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈనెల 17న భేటీ అయి ఆయనకు నోటీసులిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ పదవిలో ఉన్నా లేకపోయినా విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గవర్నర్ అభిప్రాయాన్ని కోరగా.. రూల్ నం.173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని గవర్నర్ సూచించినట్లు గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.