ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గం, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుందని ఈసీ ప్రకటించింది.
నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు విధించింది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. ఉపఎన్నిల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తిరుపతిలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
తిరుపతిలో వైసీపీ, టీడీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా… బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారింది.