ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్ఠానం సూచ‌న‌ల మేర‌కే ఆయ‌న రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎవ‌రు బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌న్న విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం పదవి రేసులో ప‌లువురి పేర్లు విన‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల హోదాలో ఉన్న నేతల పేర్లను బీజేపీ పరిశీలించింది.

BJP MP Tirath Singh Rawat to become new chief minister of Uttarakhand

చివ‌ర‌కు ఎంపీ తీర‌త్ సింగ్ రావ‌త్ పేరును ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఉత్త‌రాఖండ్‌ రాష్ట్ర మంత్రులు ధన్సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతల పేర్లు విన‌ప‌డ్డాయి. అయితే, పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, తీర‌త్ సింగ్ రావ‌త్ పేరును ఖ‌రారు చేశారు.

మంత్రివర్గంలో ఉన్న ధన్సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచ‌నాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. కాగా, ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల‌ని, అనంత‌రం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కొత్త సీఎం తీర‌త్ సింగ్ వ‌య‌సు 56 ఏళ్లు. ఆయ‌న బీజేపీ ఎంపీ. ఉత్త‌రాఖండ్‌లో 2013 నుంచి 2015 వ‌ర‌కు ఆయ‌న ఉత్త‌రాఖండ్ పార్టీ చీఫ్‌గా చేశారు. గ‌తంలో ఎమ్మెల్యేగా చేశారు. కేంద్ర మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిషాంక్‌, మంత్రి ధాన్ సింగ్ రావ‌త్ .. కొత్త సీఎంను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా మరో పది రోజుల్లో నాలుగేండ్లు పూర్తి చేసుకోనున్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని రావత్‌ను కోరారు. సీఎం రావత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తమను పరిగణనలోకి తీసుకోవట్లేదని, అధికారులు కూడా తమ మాట వినట్లేదని వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రావత్‌ సారథ్యంలో బరిలోకి దిగితే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని వారు హైకమాండ్‌కు స్పష్టంచేశారు.