ఎన్నో ఏళ్లుగా సుప్రీం కోర్టులో నలుగుతూ పలు వివాదాలకు కారణమైన రామ మందిరం కేసులో భూమి రామాలయ ట్రస్టుకే కట్టబెడుతూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టారని చారిత్రక ఆధారాల ద్వారా రుజువు కావడంతో రామ జన్మభూమిని రామాలయం నిర్మాణానికే కేటాయించడం జరిగింది. రాముడు పుట్టిన స్థలంలోనే రాముడికి ఆలయం లేదని ఇన్నాళ్ళు చింతిస్తూ వచ్చిన భక్తులు సుప్రీం కోర్టు తీర్పుతో ఆనందపడ్డారు. కొత్తగా కట్టబోయే ఆలయం ప్రపంచం దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని భావించారు.
ఆ మేరకే 67 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం కట్టాలని రామ జన్మభూమి తీర్థ ట్రస్టు భావించింది. ఆగష్టు నెలలోనే భూమి పూజ జరపాలని భావించిన ట్రస్టు ఆ కార్యక్రమాన్ని 3 లేదా 5వ తేదీన జరపాలని అనుకుని చివరకు 5వ తేదీని శంఖుస్థాపన తేదీగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని పిఎంవో కార్యాలయానికి కూడా తెలిపారట. శంఖుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ భూమి పూజకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ కూడా హాజరు కానున్నారు.
కొత్త రామ మందిరం ఎత్తు 128 అడుగులు కాగా వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులుగా ఉండనుంది. రామాలయాన్ని మొత్తం రెండంతస్తుల్లో కట్టనున్నారు. మొదటి అంతస్తులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. రెండో అంతస్థు పైభాగాన శిఖరం ఉంటుంది. అయితే మందిరం ఎత్తు 128 అడుగులు కాకుండా 160 అడుగులు ఉంటుందని ఇంకో వాదన వినిపిస్తోంది. ఇక ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి.