వికేంద్రీకరణ, సీఆర్ డీ ఏ బిల్లుల్ని ఏపీ ప్రభుత్వం గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ముందుకు పంపిన సంగతి తెలిసిందే. జులై 17 తో శాసనమండలి గడువు పూర్తైన 24 గంటల్లోనే ఆ రెండు బిల్లులు వాయు వేగంతో గవర్నర్ ముందుకు వెళ్లాయి. ఎట్టిపరిస్థుతుల్లో ఆ రెండు బిల్లులు చట్ట రూపం దాల్చాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లు పాస్ అవ్వకుండా ప్రతిపక్ష పార్టీ టీడీపీ అంతే బలంగా పనిచేస్తోంది. ఇప్పటికే గవర్నర్ ని కలిసి రెండు బిల్లులు సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని, రాజధాని తరలింపు పై హైకోర్టులో స్టే ఉన్నా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుందని ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్లుల విషయంలో నాటకీయత చోటు చేసుకోవడానికి ఆస్కారం కనిపిస్తోంది. అవన్నీ పక్కనబెడితే ఇప్పుడు గవర్నర్ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. బిల్లులపై సంతకం చేసి చట్ట రూపం దాల్చేలా చేయడం. అదే జరిగితే జగన్ సర్కార్ కి లైన్ క్లియర్ అయినట్లే. మూడు రాజధానుల విషయంలో జగన్ ముందుకు వెళ్లిపోవచ్చు. చట్ట పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లే. రెండవ దారి బిల్లుపై న్యాయ నిపుణులు సూచనలు, సలహాలు తీసుకోవడం, కేంద్రం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం..అక్కడి ఆదేశాల మేరకు నడుచుకోవడం.
ఇక మరోదారి బిల్లుని పెండింగ్ లో పెట్టడం. చివరి రెండు ఆలోచనలు గవర్నర్ మైండ్ లో ఉంటే బిల్లు చట్ట రూపం దాల్చడానికి సమయం పడుతుంది. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు ఇప్పటికే గవర్నర్ ఓటు వేసారు. లాక్ డౌన్ అనంతరం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ముందుగా ఆయన ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అభివృద్ది వికేంద్రీకరణ రాష్ర్టానికి మంచిదని గవర్నర్ సూచించారు. విశాఖ, అమరావతి, కర్నూల్ లో మూడు రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు వృద్ధిలోకి వస్తాయని కాంక్షించిన సంగతి తెలిసిందే.