మూడు రాజధానులు వర్సెస్ రాజధాని అమరావతి.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కొత్త మలుపు తిరగబోతోంది. రాజధాని అమరావతి కోసం ‘అమరావతి పరిరక్షణ సమితి’ మహా పాదయాత్ర చేస్తోన్న విషయం విదితమే. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ ఈ మహా పాదయాత్రను చేపట్టింది అమరావతి పరిరక్షణ సమితి. మరోపక్క, మూడు రాజధానుల కోసమంటూ గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న మరో వర్గం కూడా మహా పాదయాత్ర చేస్తామంటోంది.

సో, ఇకపై మూడు రాజధానులు వర్సెస్ రాజధాని అమరావతి ఉద్యమం అనే ‘యుద్ధం’ కొత్త మలుపులు తిరగబోతోందన్నమాట. ఒకే రాష్ట్రంలో.. ప్రజలిలా మూడు వర్సెస్ ఒకటీ.. అంటూ విడిపోయి, ఒకరి మీద ఒకరు పోటాపోటీ ఆందోళనలు చేయడం, నిరసన మార్గాల్ని ఎంచుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం.?

ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి గనుక, అమరావతిలో ఎలాంటి ఆందోళనలకూ ఆస్కారమీయకుండా అక్కడ అభివృద్ధిని కొనసాగించి వుంటే, అసలు ఇప్పుడీ దుస్థితి వచ్చి వుండేది కాదు.

అమరావతి పరిరక్షణ సమితి చేపడుతున్న యాత్ర త్వరలో రాయలసీమలోకి ప్రవేశించనున్న దరిమిలా, మూడు రాజధానుల కోసం కూడా ఇంకో వర్గం మహా పాదయాత్ర బాట పడితే మాత్రం, ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులేర్పడతాయి. అది రాష్ట్రానికి అస్సలేమాత్రం మంచిది కాదు.

అధికార పార్టీనే, మూడు రాజధానుల ఉద్యమాన్ని నడిపిస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. అమరావతి పరిరక్షణ సమితితో చర్చించి, రైతులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టి, అమరావతి అభివృద్ధికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుడితే.. అసలు ఈ వివాదమే వుండదు కదా.?