Naga Mahesh: ప్రజారాజ్యం పార్టీని భ్రష్టుపట్టించింది వాళ్లే..నాగ మహేష్..!

Naga Mahesh: సినిమాపై ఉన్న అభిమానం, సినిమా పాటలపై ఉన్న ఆసక్తి, సాహిత్యంపై బాగా ఆకర్షితుడినై తెలుగు నేర్చుకోవాలని నిశ్చయించుకున్నానని, అలా తెలుగు భాషపై పట్టు సాధించగలిగానని నటుడు నాగ మహేశ్ అన్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారంటే తనకు చాలా అభిమానమని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు దగ్గరయ్యారని నాగ మహేశ్ అన్నారు. తనకు నిజానికి రాజకీయాలంటే ఆసక్తి లేదన్న ఆయన, టీడీపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా రచనలు రాసి సత్యాగ్రహి అనే పేరుతో పార్టీ ఆఫీసులకు పంపే వాడినని ఆయన చెప్పుకొచ్చారు. సింపుల్ లాంగ్వేజ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల సత్యాగ్రహి చాలా ఫేమస్ అయిందని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా చాలా తక్కువ కాలంలోనే చిరంజీవి గారిని తాను కలవగలిగానని ఆయన అన్నారు. కేవలం ఆయన్ను కలవాలన్న ఉద్దేశంతోనే అది మొదలుపెట్టలేదని, పార్టీ కోసం తనవంతు ఏం చేయొచ్చు అని ఆలోచించినపుడు రచన తన చేతిలో పని. కాబట్టి దాన్నే ఆయుధంగా మలచుకున్నానని ఆయన వివరించారు. అంతేగాని ఆయన్నుంచి ఇంకేమీ ఆశించలేదని ఆయన స్పష్టం చేశారు. దాంతో అది చిరంజీవికి నచ్చడం, తనను కలవడం జరిగిందని ఆయన అన్నారు.

కొంతమంది పార్టీ కోసం పనిచేసిన వాళ్లు కూడా బయట ఇతర పార్టీల వాళ్లు మాటలకు ఆకర్షితులయ్యారని ఆయన చెప్పారు. అందులో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆయన అన్నారు. అలా ఒక రీతి లేకుండా వెళ్లడంతో పార్టీని కాపాడుకోలేని స్థితికి వచ్చామని ఆయన తెలిపారు. ఆ తర్వాతనే అందరం ఆలోచించి పార్టీని విలీనం చేశామని ఆయన వివరించారు.