అచ్చెన్నాయుడు పనితనాన్ని మెచ్చో లేక ఆయనను రాజకీయంగా లాక్ చెయ్యడానికో తెలియదు కానీ అచ్చెన్నాయుడును ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రెసిడెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పదవి మాత్రం ముమ్మాటికీ ఆయన కోరుకున్నది కాదు. కానీ పతనావస్థలో ఉన్న టీడీపీని గట్టెకించడానికి, టీడీపీ నాయకుల్లో నూతన ఉత్సహం నింపడానికి, అచ్చెన్నను వేరే పార్టీలలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి బాబు వేసిన రాజకీయ ఎత్తుగడ ఇది.
పార్టీ ప్రెసిడెంట్ నియమించినప్పుడు టీడీపీని తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని, పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొస్తానని, సీనియర్లనూ, జూనియర్లనూ కలుపుకుపోయి, పార్టీని బలోపేతం చేస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు.
కానీ ఇదే సమయంలో మొత్తం వ్యవహారాల్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చక్కబెట్టేసుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా లోకేష్ పర్యటించారు కానీ అక్కడికి అచ్చెన్నాయుడు వెళ్ళలేదు. దాదాపు పార్టీకి సంబంధించిన అన్ని పనులను లోకేష్ మాత్రమే చక్కబెడుతున్నారు. ఇవన్ని చూస్తున్న అచ్చెన్నాయుడు అభిమానులు కోపంగా ఉన్నారని సమాచారం. అన్ని లోకేషే చేస్తున్నపుడు తమ నేతను పార్టీ ప్రెసిడెంట్ గా నియమించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనలు వింటున్న రాజకీయ వర్గాలు నిజమేనని అంటున్నారు.
లోకేష్ చేస్తున్న పర్యటనల్లో కనీసం ఒక్కదానికైనా అచ్చెన్నను లోకేష్ వెంటబెట్టుకుని వెళ్ళాల్సి వుందనీ, పోనీ.. అచ్చెన్న వద్దకు వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏదన్నా పార్టీ కార్యక్రమం చేపట్టి వుండాలనీ ‘కింజరాపు’ అభిమానులు వాపోతున్నారు. టీడీపీకి ఉత్తరాంధ్ర ఒకప్పుడు కంచుకోట. కానీ, అది బద్దలైపోయింది. మళ్ళీ నిర్మించడం అంత తేలిక కాదు. పైగా, పార్టీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పని ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఇన్నిరోజులు విధులు నిర్వహిస్తారో వేచి చూడాలి.