కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ ప్రభావం ముందుగా తాకింది సినిమా రంగాన్నే. తొలుత సినిమా థియేటర్లు మూతబడ్డాయి. తర్వాత షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో వేలాదిమంది సినీ, థియేటర్ రంగాల్లోని కార్మికులు ఉపాధిని కోల్పోయారు. అయితే పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఈ జూన్ నెలాఖరుకు చాలా సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి. జూలైలో అన్ని సినిమాలు మొదలైపోతాయి. ఈమేరకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మిగిలింది సినిమా హాళ్లే. గత లాక్ డౌన్ సమయంలో థియేటర్లు రీఓపెన్ కావడానికి చాలా సమయమే పట్టింది.
అయితే ఈసారి మాత్రం అంత ఆలస్యం ఉండదు. జూలై నెలలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేస్తున్నారు. కేవలం నైట్ కర్ఫ్యూ వరకే పరిమితం కావాలనుకుంటోంది కేసీఆర్ సర్కార్. జూలై నెలకు పూర్తి రిలాక్సేషన్ రానుంది. అందుకే జూలైలో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుచుకుంటాయని తెలుస్తోంది. నిర్మాతలు కూడ ఇదే నమ్మకంతో ఉన్నారు. ఇక ఆంధ్రాలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అవుతాయని, ఆగష్టు నెలకు పూర్తిగా తెరుచుకుంటాయని సమాచారం. సినిమా హాళ్లు ఓపెన్ అవుతాయనే నమ్మకంతోనే తమ సినిమాలను ఓటీటీలకు వెళ్లకుండా ఆపుకుంటున్నారు చాలామంది హీరోలు.