అధికారంలో ఉన్న పార్టీ మీద ఆరోపణలు సహజమే, ప్రతిపక్షాలు ఎప్పుడెప్పుడు విమర్శలు చేయాలా అని కాచుకొని కూర్చుంటాయి, అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వకుండా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నాడు, అయితే మరోపక్క వైసీపీ లోని కొందరు ఎమ్మెల్యే ల మీద అవినీతి, అక్రమాల ఆరోపణలు రావటం ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది.
తన మాజీ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబులరెడ్డి పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. నంద్యాలలో రూ.3 కోట్లు విలువ చేసే 50 సెంట్ల భూమిని బంధువుల చేత రిజిస్టర్ చేయించుకున్నారని శ్రీలక్ష్మీ దేవి అనే మహిళ ఆరోపించింది.
కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్ లక్ష్మీదేవి భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. ఆమె భర్తకు అతడి అన్నతో కలిపి పురపాలక సంస్థ కార్యాలయం వెనుక ఈ భూమి ఉంది. ఆ భూమిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకోలేదు. ఇటీవల ఆ భూమిని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరియు ఆయన తనయుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం తమకు తెలియదు అని.. తమ సంతకాలు లేకుండానే రిజిస్ట్రర్ చేయించుకున్నట్లుగా లక్ష్మి దేవి ఆరోపించారు.
తమకు ఆ భూమి ఒక్కటే జీవనాధారమని దానిని కూడా లాక్కోవటంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నని ఆమె తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే నంద్యాలలో పోలీసుల తీరు వలన ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోని వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు రావటం పార్టీకి డ్యామేజ్ కలిగించటం ఖాయం.