ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలోనే మెనిఫెస్టో ని దాదాపు 80 శాతం పూర్తి చేసారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపైనా ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తుంది. కానీ ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏ ముహూర్తాన తలపెట్టారో గానీ! ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాటిని ఆసరాగా తీసుకుని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. తప్పు ఎక్కడా జరిగినా అదొచ్చి జగన్ మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది అనడానికి ఏడాది పాలనలో ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం అంతకు మించి వివాదాస్పదం అవుతోంది.
తూర్పు గోదావరి జిల్లా రాజా నగరం ఆవ భూములు వ్యవహారం ఇప్పుడు రాష్ర్టంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజమండ్రి అర్బన్ , రూరల్ ప్రాంతాలకు చెందిన వారికి ఆవ భూముల్ని కేటాయించారు. రైతుల నుంచి ఎకారం 45 లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు 500 ఎకరాలు కొన్నారు. అయితే వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లడంతో ఆ భూములు వరదతో మునిగిపోయాయి. ఇప్పటికే అవి ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండే భూములు కాదని, నిర్మాణం చేపడితో ఎందుకు పనికి రావని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపించింది. తాజాగా పది అడుగుల వరద నీటిలో ఆవ భూములు మునిగిపోవడంతో ఇప్పుడా సమస్య ప్రభుత్వానికి సంకటంగా మారింది.
ఈ భూముల్ని, బాధితుల్ని ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ప్రభుత్వాన్ని దుయ్యబెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల స్థలాలపై విజులెన్స్ కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు. అయితే తాజా పరిస్థితి జగన్ కు ప్రతికూలంగా మారేదే. ఇళ్ల స్థలాల విషయంలో ఇంత అజాగ్రత్త అన్నది ప్రశ్నించ దగ్గదేనని రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఈ పథకం జగన్ కు ఎంత మాత్రం కలిసొచ్చేది లా కనిపించలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.