ANR – NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి భానుమతి హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా తన సొంత నిర్మాణ సంస్థ అయిన భరణీ పిక్చర్స్ నిర్మించిన మూడు సినిమాలలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. వీటిలో చింతామణి సినిమా ఒకటి. ఈ చిత్రానికి భానుమతి భర్త రామకృష్ణారావు స్వీయ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో బిల్వమంగళుడు పాత్రలో నటించడానికి ముందుగా నాగేశ్వరరావును భావించి అతనిని సంప్రదించారు.
కథ మొత్తం విన్న నాగేశ్వరరావు ఇందులో నటించనని చెప్పడమే కాకుండా భరణి పిక్చర్స్ నిర్మించదగ్గ సినిమా ఇది కాదని ఈ సినిమా చేయకపోవడమే మంచిదని సూచించారు. అయితే అప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో వెనకడుగు వేయకుండా ఈ సినిమాని ముందుకు నడిపించారు. ఇలా ఇదే బ్యానర్లో ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాలో చింతామణి పాత్రలో భానుమతి నటించారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎలాంటి భంగం కలగకుండా ఆమె పాత్రను ఒక భక్తురాలిగా మార్పులు చేశారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు పెద్దగా ఈ చిత్రాన్ని స్వీకరించ లేకపోయారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ను ఎదుర్కోవలసి వచ్చింది. అలా ఏఎన్ఆర్ వద్దన్న సినిమాలో ఎన్టీఆర్ నటించి డిజాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.