Kondapolam: ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మరొక హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ హీరో బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొదటి సినిమా విజయవంతం కావడంతో ఈ హీరోకి వరుస అవకాశాలు వచ్చాయి.
ఇలా తన రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే నవల ఆధారంగా కొండపొలం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమా ద్వారా గొర్రెలకాపరులు అడవిలో వాటి కోసం ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనే విషయాలను దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 8 వ తేదీ థియేటర్లో విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.
ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా జనవరి రెండవ తేదీ స్టార్ మా ఈ సినిమాను ప్రసారం చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొండపొలం చిత్రం ఏకంగా 12. 34 టిఆర్పి రేటింగ్ కైవసం చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఐదు కోట్లు చెల్లించి స్టార్ మా కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా టెలికాస్ట్ చేయడంతో ఏకంగా 12. 34 టిఆర్పి రేటింగ్ రావడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లో వెళ్ళడమే కాకుండా లాభాల బాట పట్టిందని చెప్పవచ్చు.మొత్తానికి వెండితెరపై బోల్తాకొట్టిన ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుందనే చెప్పాలి.