Kohli : కెప్టెన్ కోహ్లీ క్లీన్ బౌల్డ్: చక్రం తిప్పుతున్నదెవరంటే.!

Kohli :టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్రమంగా పట్టు కోల్పోతున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లకు గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వుండేవాడు. ఇటీవలే టీ20 కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించారు. త్వరలో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ అగ్రెసివ్ ఆటగాడు. టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే, విరాట్ కోహ్లీని ప్రస్తుతం మూల స్తంభంగా భావిస్తున్నాం. అయితే, సహజమైన అగ్రెసివ్ నేచర్ కారణంగా విరాట్ కోహ్లీ మొదటి నుంచీ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోచ్ విషయంలో కావొచ్చు, జట్టు కూర్పు విషయంలో కావొచ్చు.. విరాట్ కోహ్లీ చాలా వివాదాల్ని ఎదుర్కొన్నాడు.

ఆటగాడిగా తిరుగులేని ఫామ్ కొనసాగిస్తున్న సమయంలో ఆ వివాదాలన్నీ ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయాయి. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది. ఎప్పుడైతే టీ20 కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించేశాడో, ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.

వాస్తవానికి చాలాకాలంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మీద విమర్శలున్నాయి. జట్టులో రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీకి చాలా పోటీ వుంది. టెస్టుల్లో రోహిత్ శర్మ ఒకింత ఇబ్బంది పడుతుండడం విరాట్ కోహ్లీకి కలిసొచ్చింది. కానీ, ఇకపై విరాట్ కోహ్లీ చక్రం తిప్పడానికేమీ లేదు.

త్వరలో, అతి త్వరలో టెస్ట్ కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకోవాల్సి రావొచ్చు. ఈ పరిణామాలకు రోహిత్ శర్మ ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. అయితే, రోహిత్ ఇలాంటి సిల్లీ విషయాల్ని పట్టించుకోడనేవాదనా లేకపోలేదు. బీసీసీఐలో ఓ బలమైన శక్తి కారణంగా విరాట్ కోహ్లీ, ముందు ముందు జట్టుకి కూడా దూరమయ్యే సూచనలున్నాయట. అంటే, రిటైర్మెంట్ ప్రకటన త్వరలో కోహ్లీ నుంచి రావొచ్చేమో.