ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్కును ఏర్పాటు చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులేస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో అంబానీ ఈ జూ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. ‘గ్రీన్స్ జులాజికల్ రెస్క్యూ అండ్ ది రిహాబిలిటేషన్ కింగ్‌డమ్’ పేరిట సమర్పించిన డీపీఆర్‌కు సెంట్రల్ జూ అథారిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది.
జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీకి చేరువలో ఆ సంస్థకు ఉన్న 280 ఎకరాల స్థలంలో ఈ జూను ఏర్పాటు చేయబోతున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్‌గా దీన్ని చెబుతున్నారు. రిలయన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా.. వన్య ప్రాణులకు ఆవాసం కల్పించడం కోసం గుజరాత్ అటవీ శాఖకు సహకరించడం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ తోడ్పడనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పార్కు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
రిలయన్స్ ఏర్పాటు చేయబోయే జూలో ప్రపంచం నలుమూలల నుంచి.. 100కిపైగా రకాల భిన్న జాతుల పక్షులు, సరీసృపాలు, జంతువులను తీసుకొచ్చి ఉంచనున్నారు. ఎలుగుబంట్లు, కొమోడో డ్రాగన్లు, తోడేళ్లు, పెలికాన్లు, అరిచే జింకలు.. తదితర జంతువులను ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచనున్నారు. చిరుతలు, జిరాఫీలు, ఏనుగులు, ఆఫ్రికా సింహాలు, నిప్పు కోడి తదితర వన్య ప్రాణులను ఈ జూలో ఉంచుతారు. ఇప్పటికే గుజరాత్‌లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం ఉంది. త్వరలోనే ప్రపంచంకెల్లా అతిపెద్ద జూ సైతం ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు కానుంది.