తొలి నడక.. ఆమె మళ్ళీ నేర్చుకుంటోంది.!

యాషిక ఆనంద్ గుర్తుందా.? కొన్నాళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై, మృత్యువు కౌగిలిలోకి వెళ్ళినట్లే వెళ్ళి, ప్రాణాపాయంతో బయటపడ్డ ఈ భామ, పలు రకాల సర్జరీల అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సుమారు 95 రోజుల పాటు ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది.

ఎట్టకేలకు తొలి అడుగు కొద్ది రోజుల క్రితమే వేసింది.. తన కాళ్ళ మీద యాషికా ఆనంద్. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తొలి నడక మళ్ళీ మొదలు పెట్టానని చెబుతూ, ఒకింత భావోద్వేగానికి గురైంది.

రోడ్డు ప్రమాదంలో యాషిక, తన స్నేహితురాల్ని కోల్పోయింది. అతి వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో యాషిక స్నేహితురాలు ప్రాణాలు కోల్పోగా, యాషిక తీవ్ర గాయాలతో బయటపడింది.

ప్రమాద సమయంలో ఎవరు వాహనాన్ని నడిపారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. మద్యం సేవించి వాహనాన్ని నడిపారనే ఆరోపణలూ వచ్చాయి. అయితే, వాటన్నిటినీ యాషికా ఆనంద్ అప్పట్లోనే కొట్టిపారేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. యాషిక, విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.