ఈ మధ్యకాలంలో రోజురోజుకి హత్యా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలు భార్యాభర్తల గొడవలు ఆస్తి తగాదాలు పాత కక్షలు వంటి కారణాల చేత ఎంతోమంది హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు. తాజాగా బషీరాబాద్ లో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులను హత్య చేసి గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగినట్టుగా సృష్టించారు. అయితే అది ప్రమాదవశాత్తు జరిగినది కాదని ఎవరో కావాలనే ప్రణాళిక ప్రకారం గ్యాస్ లీక్ చేశారని పోలీసులు వెల్లడించారు.
వివరాలలోకి వెళితే…జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ రామిరెడ్డి నగర్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రామిరెడ్డి నగర్ లో ఒక భవనంలో నివాసం ఉంటున్న ఎనిమిది మంది వ్యక్తులు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో గొడవ పడుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అక్కడ గస్తీ కాస్తున్న బ్లూ క్లోట్స్ వాహన సిబ్బంది గొడవ జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని భవనంలోకి వెళ్ళబోయారు. అయితే అప్పటికే అక్కడ గ్యాస్ సిలిండర్లు లీక్ చేసినట్టు స్థానికులు బ్లూ క్లోట్స్ సిబ్బందిని హెచ్చరించారు. దీంతో సిబ్బంది జాగ్రత్తగా భవనంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు.
అయితే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఉంటుందని భావించారు. ఆ తర్వాత భవనం లోపలికి వెళ్లి మృతదేహాలను పరిశీలించిన పోలీసులకి అనుమానం కలిగింది. పొరపాటున గ్యాస్ సిలిండర్ లీకై పేలి ఉంటే సమీపంలో ఉన్న వ్యక్తి శరీరం తీవ్రగాయాలపాలయ్యది కాకపోతే అక్కడ పడి ఉన్న శవాలు హత్య చేసినట్లు బోర్లా పడి ఉండటంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో ఎవరో వారిని హత్య చేసి కావాలనే గ్యాస్ సిలిండర్ పేల్చి ఈ విషయాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అయితే ఈ ఘటనకు కారణమైన భువనేశ్వర్ సింగ్ అని వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం నగరానికి చేరుకున్న భువనేశ్వర్ సింగ్ ఆ రూమ్ లో ఉంటున్నాడని స్థానికులు వెల్లడించారు. అయితే అతడు వచ్చిన దగ్గర నుండి అతని ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉందని వారు వెల్లడించారు. సాయంత్రం గొడవ జరుగుతున్న సమయంలో కూడా భువనేశ్వర్ సింగ్ పెద్ద పెద్దగా అరుస్తూ సామాన్లన్నీ విసిరేస్తూ తలుపులు బద్దలు కొట్టాడని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అసలు వీరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏమిటి? హత్య ఎలా చేశాడు? అన్న విషయాల గురించి దర్యాప్తు మొదలుపెట్టి భువనేశ్వర్ సింగ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.