Thammareddy: వాళ్లు మాత్రమే సీఎం జగన్‌ను కలవడానికి కారణం అదే: తమ్మారెడ్డి భరద్వాజ్

Thammareddy: సీఎం జగన్‌ను కలవడానికి ప్రత్యేకించి ఆ హీరోలే వెళ్లారు అనే విషయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. వాళ్లంతా టాప్ హీరోలని కావచ్చన్న ఆయన, ప్రస్తుతం రెవెన్యూ పరంగా సినీ ఇండస్ట్రీ అంతా వాళ్ల మీదే ఆధారపడి ఉంది కదా అని ఆయన చెప్పారు. కాబట్టి వాళ్లు వెళ్లడంలో తప్పేమీ లేదని, నష్టం అంతకన్నా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే పరిష్కారం అవుతుందనుకుని వెళ్లి ఉంటారు.. అందుకే వాళ్లను కూడా తీసుకొని వెళ్లారేమోనని ఆయన తెలిపారు.

ఇకపోతే ప్రతి దాని గురించి ఇలా చర్చించడం అనవసరమని తమ్మారెడ్డి అన్నారు. ఫైనల్‌గా పని జరిగిందా, లేదా అన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. దానికి సంతోషించాలే తప్ప, ఈ చర్చలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రత్యేకించి వాళ్లే ఎందుకు వెళ్లారు అంటే దానిక్కూడా ప్రత్యేకించి కారణమేమీ లేదని వెళ్లాలనుకున్నారు, వెళ్లారు అని ఆయన సమాధానమిచ్చారు. వాళ్లు లిమిటెడ్‌గా రమ్మని పిలిచినట్టున్నారు, అందుకే వాళ్లు వెళ్లారని ఆయన అన్నారు.

మొత్తం మీద అటు పెద్ద సినిమాలకు, ఇటు చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వం సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్లను పిలిచారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. లేకపోతే కేవలం వీళ్లనే పిలిచేవారు కదా.. ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదనే నారాయణ మూర్తిని కూడా పిలిచారేమో అని తాను భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు అన్నట్టు మరో 10 రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందన్న మాటలు నిజం కావాలని తామందరూ కూడా కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ రోజు అయినా చాలా సంతోషం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.