Thammareddy Bharadwaja: కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ ధర హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమస్యపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడడానికి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి స్టార్లు వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. వారికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టే సమాచారం. ఈ విషయాన్ని సినీ పెద్దలే స్వయంగా ప్రకటించారు.
కాగా ఈ టికెట్ ధరల వ్యవహారంపై ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలకృష్ణ లాంటి వాళ్లు జగన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని, అసలు సినిమా టికెట్ల ధర తగ్గించడమనేది సమస్యే కాదని ఆయన కామెంట్ చేశారు. కేవలం టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
టికెట్ ధరలు తగ్గించడమనేది అసలు సమస్యే కాదన్న తమ్మారెడ్డి… ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అసలు ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరిపారో, దేని కోసం వెళ్లారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కొన్ని సార్లు టికెట్ రేటు తగ్గించడం చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారుతుందేమో గానీ భారీ బడ్జెట్ సినిమాలకు అసలు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన తెలిపారు. ఎందుకంటే ఆ సినిమాలు విడుదలైనపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ మొత్తం దానికి ఇస్తున్నారు కదా అని ఆయన అన్నారు. ఉదాహరణకు ఆర్. నారాయణమూర్తి నటించిన సినిమా 60 స్క్రీన్లలో వేశారనుకుంటే, పెద్ద సినిమాలను మాత్రం దాదాపు 4వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తారన, కావాలంటే ఆ 60 స్క్రీన్లలో నారాయణమూర్తి సినిమా కాకుండా భారీ బడ్జెట్ సినిమా వేసి, వాళ్లకిష్టమైన విధంగా 10వేల రూపాయల టికెట్లు పెట్టుకోమని ఆయన స్ట్రాంగ్‌గా వారించారు. ఊర్లల్లో ఉన్న సినిమా థియేటర్లను కూడా కబ్జా చేసి, ఇంకా రేట్లు పెంచమని అడిగితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇది కూడా ఓ రకంగా ప్రేక్షకుల్ని దోచుకోవడమేనని ఆయన అన్నారు. ఏపీలో టికెట్ ధరలు తక్కువగా చాలా సినిమాలు విడుదలై, మంచి విజయాన్ని కూడా సాధించాయని ఆయన కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పారు. వాటికి రాని సమస్య పెద్ద సినిమాలకు మాత్రం ఎందుకొస్తున్నాయని ఆయన మండిపడ్డారు.