జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూన్నారు. ఈ పర్యటన లో భాగంగా నేడు రైతులను పరామర్శించేందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పొయ్య గ్రామానికి పవన్ వెళ్లారు. అక్కడ పవన్‌ను రాకుండా అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడే మోహరించారు. మరికాసేపట్లో పొయ్య గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్న సమయంలోఈ ఘటన చోటు చేసుకుంది.
నివర్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ఐదు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటన కొనసాగింది. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రేపు నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటన కొనసాగనుంది. ఏపీలో ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా రాయలసీమలోని చిత్తూరు, కోస్తాంధ్రలోని నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు బాగా నష్టపోయాయి.
దీంతో రైతులను ఆదుకోవాలని కోరుతూ, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపట్టారు. అక్కడ జనసేన నేతలతో సమావేశమై పంట నష్టం లెక్కలను తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు కనీసం రూ.25వేల నుంచి రూ.30వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అత్యవసరంగా కనీసం రూ.10వేల సాయం అందించాలని కోరారు. రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం అని చెప్పారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు ‘జై కిసాన్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు