Happy New Year : నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆనందంగా, ఆరోగ్యంగా.!

Happy New Year : కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. మళ్ళీ మనతోపాటే కరోనా వైరస్‌ని కూడా కొత్త సంవత్సరంలోకి తీసుకొచ్చేశాం. తప్పించుకుందామనుకున్నాంగానీ, తప్పలేదు. నిజానికి, కరోనా వైరస్ మన దగ్గరకు రాలేదు. మనమే దాని దగ్గరకు వెళ్ళాం. దాంతో, అది మన వెంటే వచ్చేసింది.

వేరియంట్ల పేర్లు మారుతున్నాయంతే.. మనిషి ఫేట్ మాత్రం మారడంలేదు. కొత్త ఏడాది ఎలాంటి కలకలం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సృష్టిస్తుందో అంచనా వేయడమే కష్టంగా వుంది. అయితే, ఒమిక్రాన్ సోకినా, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు చాలా తక్కువంటూ వైద్య నిపుణులు చెబుతుండడం ఒకింత ఊరటనిచ్చే అంశం.

సరే, కొత్త సంవత్సరాన్ని కూడా కరోనా వైరస్‌తోనే మొదలు పెట్టాల్సి వస్తోంది.. ఏం చేయలేం. కరోనా భయాల్ని పక్కన పెట్టి మరీ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున హంగామా చేయడం.. ఒమిక్రాన్ వేరియంట్‌కి కూడా కొత్త ఉత్సాహాన్నిచ్చిందని చెప్పక తప్పదు.

కరోనా భయాల్ని పక్కన పెట్టేస్తే, ఈ ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిద్దాం. తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ పాలకులు మంచి పరిపాలన ప్రజలకు అందించాలనీ కోరుకుందాం. వివాదాల్లేని రాజకీయాల్ని అయితే చూడలేం. అయితే, గత ఏడాదిలా మరీ పెద్ద వివాదాలుండకూడదని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా.!

అన్నిటికీ మించి, ఈ ఏడాదితో కరోనా వైరస్‌కి ముగింపు రావాలని దేవుడ్ని ప్రార్థిద్దాం. ఒమిక్రాన్ రాకతో, మొత్తంగా కరోనా వైరస్‌కి చెక్ పడినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నదే నిజమైతే ఎంత బావుంటుంది.? ఒమిక్రాన్ దెబ్బకి ప్రపంచ మానవులందరికీ ఇమ్యూనిటీ వచ్చేస్తే మంచిదే కదా.