Telugu Medium : ఇంగ్లీషు మీడియం సరే, తెలుగు మీడియం వుండదా.?

Telugu Medium : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల క్యాబినెట్ భేటీ సందర్భంగా కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం అనేది కొత్త విషయం కాదు. కొన్ని స్కూళ్ళలో ప్రయోగాత్మకంగా ఎప్పటినుంచో అమలు చేస్తూనే వున్నారు.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రయత్నం జరిగితే, అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు మీడియంని అటకెక్కించి ఇంగ్లీషు మీడియంని తీసుకొస్తున్నట్లు ప్రకటించి అందర్నీ విస్మయానికి గురిచేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అవసరమే. అదే సమయంలో, తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునేవారికి ఆ వెసులుబాటు ఖచ్చితంగా వుండి తీరాలి. ఏ మాధ్యమంలో చదువుకోవాలన్నది విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల ఇష్టం. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం వంటివి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంటుంది.

మాతృభాషను మర్చిపోతే అసలు మనిషి మనుగడకే అర్థం లేదన్నది నిర్వివాదాంశం. ఇంగ్లీషు మీడియం వుండాలి, దాంతోపాటుగా తెలుగు మీడియం కూడా కొనసాగాలి. కానీ, ఇంగ్లీషు మీడియం మోజులో పడి, తెలుగు మీడియం వైపు విద్యార్థుల తల్లిదండ్రులూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆ ఇంగ్లీషు మీడియంలో వున్న మాయ ఏమిటోగానీ, ప్రభుత్వాలూ అటువైపే పరుగులు పెడుతున్నాయి.

తెలంగాణ అంటే.. తెలుగుకి ఆన.. అంటారు తెలంగాణలో చాలామంది మరి. ఇంగ్లీషు మీడియం రాకతో, తెలుగు మీడియం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతుందా.? కేసీయార్ సర్కార్ ఆలోచన ఏంటి.? ఏమో, వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం అంటున్నారు గనుక.. అప్పటిదాకా వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో.!