అమెరికాలో వెలుగిపోతున్న తెలుగు భాష..! ఎలా అంటే..

అమెరికాలో తెలుగు భాష వర్దిల్లుతోంది..! అంటే.. అమెరికన్లు తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నారని కాదు సుమీ..! తెలుగు ప్రజలు ఎక్కువ అవుతున్నారు. అవును.. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆఫీసులు, పనివేళల్లో మినహాయిస్తే.. ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో భారతీయ యువతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. హైదరాబాద్ నుంచి తెలుగువారు ఎక్కువగా వెళ్తున్నారు. దీంతో గత ఏడేళ్లలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగింది.

ఇంగ్లీష్ తర్వాత అమెరికాలో ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉంది. అమెరికా థింక్ టాంక్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సెంటర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలో ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా మాట్లాడేవారిలో.. తెలుగు మాట్లాడేవారు 4లక్షల మంది వరకూ ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనం అంతా ఇంట్లో ఇంగ్లీస్ కాకుండా ఏఏ భాషలు మాట్లాడుతున్నారు అనే అంశంపైనే జరిగింది. గత పదేళ్ల నుంచి లెక్కలు తీసుకుంటే తెలుగు మాట్లాడేవారి సంఖ్య బాగా పెరిగింది.

అమెరికాలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడేవారిలో మూడో స్థానంలో ఉంది తెలుగు. మొదటి స్థానంలో హిందీ, రెండో స్థానంలో గుజరాతీ భాషలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కు హైదరాబాద్ హబ్ లా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగాయి. సాఫ్ట్ వేర్ వైపు యువత ఆసక్తి చూపిస్తోంది. దీంతో అమెరికా వెళ్లేవారు ఎక్కువవుతున్నారు. భారతీయులకు హెచ్-1బి వీసా స్కీమ్ వీరికి ప్రయోజనంగా మారింది. ఏటా అమెరికాకు వర్కింగ్ వీసా మీద వెళ్లేవారిలో 70 శాతం భారతీయలే ఉంటున్నారు. దీంతో అమెరికాలో తెలుగువారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.

అక్కడ తెలుగు మాట్లాడేవారు ఎక్కువ అవుతున్నారు. అమెరికాలో తెలుగు సంఘాలు కూడా ఎక్కువే. దీంతో తెలుగు భాష వ్యాప్తికి వారి కృషి ఉంటోంది. అమెరికన్లు తెలుగు భాషపై ఉత్సాహం చూపిస్తున్నారు. దేవాలయాల్లో తెలుగు నేర్పుతున్నారు. తెలుగు సంఘాలు నడుపుతున్న ‘మన బడి’, ‘పాఠశాల’ కూడా తెలుగు ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. దీంతో అమెరికాలో తెలుగు భాష పరిఢవిల్లుతోందనే చెప్పాలి.