తెలంగాణ పోలీస్ అభ్యర్థులు అలర్ట్…. పరీక్ష తేదీల పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..?

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖలో ఉన్న పోస్టుల భర్తీ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్‌ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. వివిధ నోటిఫికేషన్ల కింద విడుదల చేసిన 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.

పరీక్షల తేదీల వివరాలు :

తాజాగా ఈ రాత పరీక్షకు సంబంధించిన తేదీల వివరాల గురించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షకు ఎంపికైన 1,11,209 అభ్యర్థులకు మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 11 న ఐటీ, కమ్యూనికేషన్స్‌ ఎస్‌ఐ, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు పరీక్ష జరగనుంది. అలాగే మార్చి 26న పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్‌ 2న కానిస్టేబుల్‌ మెకానిక్, డ్రైవర్‌ పోస్టులకు, ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో సివిల్‌ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్‌ 30న సివిల్‌ కానిస్టేబుల్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి.

రాత పరీక్షల కేంద్రాల వివరాలు :
అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్‌ ఎస్సై, ఫింగర్‌ప్రింట్‌ ఏఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్‌ ఎస్సైల రాత పరీక్షకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తో పాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.