దేత్తడి హారికపై తెలంగాణ మార్కు రాజకీయం.!

Dethadi Harika
Dethadi Harika
Dethadi Harika

బిగ్ బాస్ రియాల్టీ షో ఏం సరిపోతుంది.? అంతకు మించిన ట్విస్టుల్ని రియల్ లైఫ్‌లో చూస్తోంది బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు కంటెస్టెంట్, తెలంగాణ ఆడపడుచు దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక. తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమెకు అవకాశం కల్పించారు సంబంధిత శాఖ అధికారి శ్రీనివాస్ గుప్తా. ఏం లాభం.? ఆ వెంటనే ఈ వ్యవహారం వివాదాస్పదమయ్యింది. తనకు దక్కిన గౌరవానికి ఉప్పొంగిపోతున్న సమయంలోనే, అదంతా తూచ్.. అని అదే టూరిజం శాఖ నుంచి ‘క్లారిటీ’ వచ్చింది. నీరసపడేలోపు, ‘అదేం లేదు, ఆమె తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గానే కొనసాగుతుంది’ అంటూ ఇంకో ప్రకటన వీడియో రూపంలో వచ్చింది. ‘మీరెవరూ పుకార్లను నమ్మకండి.. నేనే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్..’ అని చెప్పుకుంటూ అలేఖ్య హారిక ఇలా ట్వీటేసిందో లేదో, ఆ వెంటనే తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ‘డేత్తడి హారిక ఎవరు.? ఆమె ఎంతమందికి తెలుసు.? బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నది త్వరలోనే డిసైడ్ చేస్తాం..’ అని తేల్చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలో వున్నాం గనుక, తర్వాత అన్ని విషయాలూ మాట్లాడతామని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. బహుశా బిగ్ బాస్‌లో కూడా హారిక ఇలాంటి ట్విస్టులు చూసి వుండదు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన అఖిల్, అనూహ్యంగా తిరిగొచ్చాడు. సీక్రెట్ రూమ్ వ్యవహారాలు అటు హౌస్ మేట్స్‌కీ, బిగ్ బాస్ వ్యూయర్స్‌కీ షాకిచ్చాయి. అంతకు మించిన స్థాయిలో హారిక చుట్టూ ఇప్పుడు ఈ ‘టూరిజం బ్రాండ్ అంబాసిడర్’ ఎపిసోడ్ ట్విస్టులతో నడుస్తోందన్నమాట. పాపం హారిక, ఈ టెన్షన్‌ని ఎలా భరిస్తుందోగానీ, ఒకవేళ ఆమెన టూరిజం విభాగం పూర్తిగా పక్కన పెట్టినట్లయితే.. అంతకన్నా అవమానం ఇంకోటుండదు.. ఆ అవమానం హారికకి మాత్రమే కాదు, తెలంగాణ మహిళా లోకానికి కూడా. ఎందుకంటే, మహిళా దినోత్సవం రోజున ఆమె ఎంపికపై ప్రకటన వచ్చింది మరి.