Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేటితో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి వుంది. పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం, ప్రజలు స్వచ్ఛందంగా నైట్ కర్ఫ్యూకి మద్దతివ్వడంతో, ప్రశాంతంగా కర్ఫ్యూ కొనసాగుతుండడం తెలిసిన విషయాలే. మరోపక్క, టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది తెలంగాణలో ఇటీవలి కాలంలో.
దాంతో, ఒకానొక సమయంలో 10వేలు దాటిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 7 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది. టెస్టుల సంఖ్య కొన్నాళ్ళ క్రితం రోజువారీగా లక్షా పాతిక వేలకు అటూ ఇటూగా వుండేది. ఇప్పుడది 70 నుంచి 80 వేలకే పరిమితమవడం గమనార్హం. కాగా, తెలంగాణలో కరోనా పరిస్థితులపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీరపై అసహనం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ రేపటితో ముగియనుండడంతో తదుపరి ప్రణాళిక ఏంటి.? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, తొలుత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు.
‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు..’ అని ప్రభుత్వం, హైకోర్టుకు తెలపడంతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు మొట్టికాయల అనంతరం, ఆదరాబాదరాగా నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి, తెలంగాణలో కరోనా వైరస్ కొంత మేర అదుపులోనే వుందని చెప్పొచ్చు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రపదేశ్, మహారాష్ట్రలతో పోల్చితే, తెలంగాణ కొంచెం బెటర్. అయినాగానీ, హైదరాబాద్ మెట్రో నగరం గనుక.. ఏమాత్రం, అలసత్వం ప్రదర్శించినా పరిస్థితులు రాత్రికి రాత్రే తారుమారైపోతాయ్. పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ కొన్నాళ్ళ క్రితం వరకు తక్కువ పరీక్షలు చేసినా, ఇప్పుడు వాటి సంఖ్య పెంచింది. తెలంగాణలోనూ కరోనా టెస్టులు పెరగాల్సి వుంది.