కాంగ్రెస్ పార్టీకి వేరే శత్రువులే అక్కర్లేదు.. ఎందుకంటే..

Telangana Congres Party Itself has Enemies

Telangana Congres Party Itself has Enemies

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ. ఈ విషయం పార్టీ అధిష్టానికీ తెలుసు. ఇంతలా కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి అంతర్గత శత్రువులే కారణం. అయినాగానీ, ఆ అంతర్గత శతృత్వాన్ని అంతర్గత ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుంది. పార్టీకి బోల్డంతమంది సీనియర్లున్నారు.. కానీ, ఏం లాభం.? ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీ బాగు కోసం పనిచేయరు. పదవుల మీద యావ తప్ప, పార్టీ కోసం పనిచేసేవారెవరూ లేరు.

పోనీ, కొత్త తరం ఏమైనా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమైతే ఊరుకుంటారా ఈ సీనియర్లు.? అదీ వుండదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా పలువురు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ బాగు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నది వేరే చర్చ. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. సీనియర్లం గనుక తమకే పార్టీ పగ్గాలు కావాలంటూ వీహెచ్ లాంటి నేతలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం కాస్తా పార్టీ మరింత భ్రష్టుపట్టిపోవడానికి కారణమవుతోంది.

తాజాగా వి.హనుమంతరావు రేపుతున్న కాక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇంకా దిగజార్చేస్తోంది. రేవంత్ తన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారన్నది వి.హనుమంతరావు ఫిర్యాదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలో రివ్యూ కూడా జరగలేదంటూ వీహెచ్ తాజాగా గుస్సా అయ్యారు. పార్టీలో తాను సీనియర్ నేతననీ, తనకు పీసీసీ పగ్గాలు కావాలనీ వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీని రేవంత్ సహా కొందరు నేతలు నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు వీహెచ్. అసలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత రచ్చ కారణంగానే, ప్రతిపక్షం ప్లేస్.. బీజేపీకి దక్కేలా కనిపిస్తోంది. ఆ స్థాయిలో కాంగ్రెస్ దెబ్బతిన్నా.. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడంలేదు.