TG: తెలంగాణలో యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్ నేతలు…. బిఆర్ఎస్ లోకి జంప్?

TG: సాధారణంగా ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండాలని కోరుకుంటారు.. ఇలా ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతిపక్ష పార్టీలో ఉండకుండా అధికార పార్టీ తీర్థం పుచ్చుకొని అక్కడికి వెళుతుంటారు కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉందని చెప్పాలి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ ఎస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ వదిలి బయటకు వస్తున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతుంది.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పుకొన్నారు. గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు కురిపించారు. రేవంత్ రెడ్డి చీటికిమాటికి ఢిల్లీ వెళ్తున్నారు తప్ప రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం అయితే ఏమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగొచ్చిందని.. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రులను నియమించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

ఇలా మంత్రులను నియమించుకోలేని ఈయన తెలంగాణలో కేసీఆర్ పేరును,ఆయన ఆనవాళ్లు లేకుండా మాయం చేస్తానని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తున్నట్లుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టకీటకీమని ప్రజల ఖాతాల్లో డబ్బులు పడడం లేదు కానీ… రాహుల్ , కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలకు కురిపించారు.