కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే… కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభపడింది.. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తేమీ కాదు. ప్రజల మద్దతు ఇప్పటికీ కాంగ్రెస్ కే ఉంది.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్.
మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు.
ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయండి.. అంటూ ఆయన సూచించారు.
ఈసందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమితులైన మనిక్కమ్ ఠాగూర్ ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరికీ పరిచయం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకులు ఆయనకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన ఠాగూర్.. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాబోతున్నదని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు ఎంత ఖర్చు పెట్టినా.. ఏం చేసినా… కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని.. కాంగ్రెస్ నాయకులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు అవుతుంది. అప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.. అందుకే కాంగ్రెస్ నాయకులంతా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉండాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి సమస్యలపై పోరాటం చేస్తూ… ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
ప్రజల అవసరాలే కాంగ్రెస్ కు ముఖ్యం.. అందుకే అధికారాన్ని పక్కనపెట్టి.. ప్రజల కోరిక మేరకు… తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆమెకు కానుకగా ఇవ్వాలంటూ ఠాగూర్ కాంగ్రెస్ నాయకులకు తెలిపారు.