చంద్రబాబు గారూ, జూనియర్ ఎన్టీఆర్ ను కుప్పానికి ప్రచారానికి తీసుకురండి‘.. ఇది కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబును ఓ కార్యకర్త కోరిన కోరిక. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు‘.. ఇది ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ కు విలేకరులు సంధించిన ప్రశ్న. కార్యకర్త అడిగిన కోరికకు మౌనమే చంద్రబాబు సమాదానం కాగా, ఇటు ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ చెప్పే విధంగానే ‘ఆ ప్రశ్నకు స్పందించడానికి ఇది వేదిక కాదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం‘ అంటూ కామెంట్స్ చేశాడు.
తాజాగా ఓ సీనియర్ నేత ‘టీడీపీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే‘ అని తేల్చిచెబుతున్నారు. ఆయన టీడీపీ నేత అనుకుంటే పొరపాటే. అధికార పార్టీ వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ‘మున్సిపల్ ఎన్నికలతో తెలుగు దేశం పార్టీ ఏపీలో ఖతం అయిపోయింది. టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. కాస్తయినా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే అది సాధ్యం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే గుంటూరు, కృష్టా ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని ఇక్కడి ప్రజలకు అర్థం అయిపోయింది.
అందుకే టీడీపీ కుయుక్తులను గ్రహించే వైసీపీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. లోకేష్ వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదు. చంద్రబాబు పని కూడా అయిపోయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే టీడీపీ కార్యకర్తలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారు‘ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా, బాలయ్య, లోకేష్ కూడా ప్రచార బరిలోకి దిగినా ఎన్నికల్లో ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీడీపీ భవిష్యత్తుపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న కామెంట్స్, పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి