TDP ‘Valapu Banam’ : జనసేనపై వలపు బాణాలు సంధిస్తున్న టీడీపీ.!

TDP ‘Valapu Banam’ :  ఓ సినిమా విషయమై తెలుగుదేశం పార్టీ ఇంత రాద్ధాంతం చేయాలా.? అదీ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో.! టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా విషయంలో కూడా టీడీపీ ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం ఆశ్చర్యకరం.
ఇదే విషయాన్ని మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని మరీ కడిగి పారేశారు. అన్నట్టు, ఓ సినిమా విషయమై మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టడం కూడా దండగ మారి వ్యవహారమే. అది ఆయన స్థాయికి తగదు కూడా.! అదేంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. అధికార పార్టీ తన స్థాయికి తగని రాజకీయాలే చేస్తోంది. అది వేరే సంగతి.
టీడీపీ వలపు బాణాల విషయానికొస్తే, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో స్నేహం కోసమో.. పవన్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసమో తెలుగుదేశం పార్టీ పడరాని పాట్లూ పడుతోందని ‘భీమ్లానాయక్’ విషయంలో టీడీపీ నేతలు పోటీ పడి మద్దతివ్వడంతోనే స్పష్టమైపోయింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, చంద్రబాబు తనయుడు లోకేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ పది నుంచి పాతిక మంది నేతలు.. వివిధ రూపాల్లో ‘భీమ్లానాయక్’ సినిమాపై స్పందించారు.. పవన్ కళ్యాణ్‌కి బాసటగా నిలుస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు.
అయితే, 2019 ఎన్నికల్లో జనసేనను టీడీపీ దెబ్బ కొట్టిన వైనాన్ని ఇంకా జనసైనికులు మర్చిపోలేదు. ఓ నటితో పవన్ కళ్యాణ్ తల్లిని టీడీపీ తిట్టించిన విషయాన్ని మర్చిపోతారా.? ఛాన్సే లేదు. టీడీపీ అనుకూల మీడియాతో చిరంజీవిపైనా, పవన్ కళ్యాణ్ మీదా తరచూ దుష్ప్రచారం చేయించే టీడీపీని జనసైనికులు క్షమించే పరిస్థితి వుండదుగాక వుండదు.