పొత్తు పంచాయితీ: జనసేనకు దక్కే సీట్లు ఇవేనా.?

45 MLA Seats  : తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య పొత్తు పంచాయితీ దాదాపు ఖాయమైపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాదు కాదు, వైసీపీ ఈ ప్రచారాన్ని బలంగా చేస్తోంది. ఇంకోపక్క ఇదే అదనుగా చేసుకుని, తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీకి కేటాయించబోయే సీట్లు ఇవీ.. అంటూ లీకులు వదులుతోంది.

‘ఎవరైనా మాతో కలిసి రావాల్సిందే..’ అంటూ జనసేనాని స్పష్టమైన సంకేతాలు పంపినా, కూటమి అంటూ ఏర్పాటైతే.. దానికి పెద్ద దిక్కు తామేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కనీసం 125 సీట్లలో తామే పోటీ చేస్తామనీ, మిగతా 50 సీట్లు మాత్రమే విపక్షాలకు ఇస్తామనీ తెలుగుదేశం పార్టీ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ.. ఈ మూడూ కూటమిగా ఏర్పాటైతే, అందులో బీజేపీకి దక్కేవి కేవలం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలేనట. ఒక్క ఎంపీ సీటు కూడా బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. ఇక్కడే పంచాయితీ ఎటూ తెగడంలేదన్నది టీడీపీ లీకుల సారాంశం.

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పాలకొండ నియోజకవర్గాల్నీ, విజయనగరం జిల్లా నుంచి శృంగవరపుకోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్నీ, విశాఖపట్నంలో విశాఖ సిటీ నుంచి రెండు, భీమిలి, అరకు, పాడేరు, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో కొన్నింటిని, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, రామంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల్ని జనసేనకు టీడీపీ కేటాయించనుందట.

పశ్చిమగోదావరి జిల్లా విషయానికొస్తే, నర్సాపురం, తాడేపల్లి గూడెం, ఏలూరు, భీమవరం, తణుకు, ఉంగుటూరుతోపాటు, పవన్ పోటీ చేస్తే మరో నియోజకర్వగం కూడానట. కృష్ణా జిల్లా నుంచి విజయవాడ వెస్ట్, సెంట్రల్, కైకలూరు, పెడన, నూజివీడు నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారట.

గుంటూరులో ఈస్ట్, సత్తెనపల్లి, తెనాలి, వేమూరు నియోజకవర్గాలు కాగా, ప్రశాకం జిల్లా నుంచి గిద్దలూరు, చీరాల, నెల్లూరు నుంచి నెల్లూరు సిటీ, చిత్తూరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, మరో నియోజకవర్గం, అనంతపురం నుంచి అనంతపురం టౌన్, కర్నూలు నుంచి ఆళ్ళగడ్డ, బనగానపల్లె, ఆలూరు, కడప నుంచి రాజంపేట, మైదుకూరు నియోజకవర్గాల్ని జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా వుందట.

అయితే, ఈ లీకుల లిస్టు అర్థం పర్థం లేనిదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.